వారం పది రోజుల్లో అర్ణబ్ తుఫాన్ పరిహారం అందిస్తాం.. మంత్రి మల్లాడి..
యానాం ప్రాంత ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసి నష్టపరిచిన అర్ణబ్ తుఫాన్ పరిహారం మరో వారం పది రోజుల్లో అందజేస్తామని పుదుచ్చేరి ప్రజాపనుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రకటించారు.
180 దేశాల ప్రతినిధులతో లండన్ లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్ సదస్సులో పాల్గొని 13గంటల విమాన ప్రయాణం తర్వాత యానాం చేరుకున్న మంత్రి గారు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సాయంత్రం 4గంటలకు సావిత్రినగర్ గ్రామం వెళ్లారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్, విశాఖపట్నం సత్యసాయి దివ్యమృతం సంస్థ 16రకాల వస్తువులతో ఇచ్చిన 2000 కిట్లు పంపిణీనీ సావిత్రినగర్, గిరియంపేట గ్రామాల్లో ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ అర్ణబ్ తుఫాన్ సహాయాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. నగదు పరిహారం తో పాటు ఇతర నష్టాల ఖరారు చెయ్యడానికి పుదుచ్చేరి వెళతానని చెప్పారు. సావిత్రి నగర్, గిరియంపేట గ్రామాల చుట్టూ రక్షణ గోడ, ఇనుప విద్యుత్ స్తంభాలు, ఇతర రక్షణ పనులకోసం రూ.113కోట్లు పరిహారం కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ ఎస్ సి మాజీ చైర్మన్ ఇమంది శంకర్ రావు, ఇన్ఫోసిస్ ఆంధ్ర ప్రదేశ్ సి ఎస్ ఆర్ హెడ్ కొంచాడ కిషోర్ కుమార్, ఆదిత్య, సుమంత్, కోమలి పాల్గొన్నారు.
రెండు గ్రామాలలో కిట్లు అందనివారికి ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా పంపిణీ చేయిస్తానని మల్లాడి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యానాం ఎం ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్, సావిత్రి నగర్, గిరియంపేట గ్రామ పెద్దలు, కోపరేటివ్ స్టోర్ ప్రెసిడెంట్ లంక విద్యాసాగర్, వైస్ ప్రెసిడెంట్ కమిడి విజయ్ కుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.